: సోనియాను తప్పుదోవ పట్టించారు...నాకు పదవులక్కర్లేదు: డీఎస్
ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించారని మాజీ కాంగ్రెస్ నేత డీఎస్ మండిపడ్డారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో తన ఫోటో తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే, ఉద్యమం నడిపింది కేసీఆర్' అని అన్నారు. ఆకుల లలితకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలో తనకు అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, ఆ విషయంలో కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో ఎలాంటి పదవి ఆశించడం లేదని డీఎస్ తెలిపారు. తన వెంట రావాలని ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని, తన వెంట వచ్చేవారి బాగోగులు చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా, ఎవరెవరికి ఏమేం చేశానో అందరికీ తెలుసని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి నడుస్తానని డీఎస్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్ నుంచి తన ఫోటో తీసేసే ముందు కాంగ్రెస్ నేతలు ఆలోచించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 8న టీఆర్ఎస్ భవన్ లో కారెక్కనున్నట్టు ఆయన తెలిపారు.