: అమెరికాలో పుట్టుకొచ్చిన కొత్త సామెత 'ఆదివారం పెళ్లి-సోమవారం గెంటివేత'!
ఆదివారం పెళ్లి చేసుకుంటే, సోమవారం గెంటివేత... అవును. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నది ఇదే. ఆదివారం నాడు ఆనందంగా తన స్వలింగ భాగస్వామిని వివాహం చేసుకుంటే, సోమవారం నాడు చేస్తున్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి నెలకొంది. అందుకే అక్కడ 'మ్యారీడ్ సండే... ఫైర్డ్ మండే' అనే కొత్త సామెత పుట్టింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధతనిస్తూ యూఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రెండు వారాలు తిరగకముందే చెత్తబుట్టలోకి చేరిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. సుప్రీం తీర్పు తరువాత ఎల్జీబీటీ (లెస్బియాన్స్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్)లపై వివక్ష ఎక్కువైనట్టు తెలుస్తోంది. లూసియానా సహా 13 యూఎస్ రాష్ట్రాల్లో సుప్రీం తీర్పు అమలు కావడం లేదని సమాచారం. ఇదిలావుండగా, టెన్నెస్సీలోని ఓ ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ 'గేలకు ప్రవేశం లేదు' అన్న బోర్డు కూడా పెట్టేసింది. కాగా, తాము దశాబ్దాలు తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను వదులుకునే పరిస్థితే లేదని స్వలింగ సంపర్క సమాజం హెచ్చరిస్తోంది.