: పాత వాహనాలు వదిలేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వనున్న కేంద్రం!
మీ పాత కారును వదిలించుకుంటే కొన్ని రకాల ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలను అందుకునే రోజు త్వరలోనే రానుంది. ఈ మేరకు 'వెహికిల్ ప్లానింగ్' ప్రతిపాదనలను రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సిద్ధం చేశారు. ఒకటికన్నా ఎక్కువ వాహనాల వాడకాన్ని నివారించే దిశగా, పాతవాటిని వదిలించుకోవాలని, అలా చేసే వారికి కొత్త వాహనాల కొనుగోలుపై ప్రత్యేక పన్ను రాయితీలు కల్పించాలన్నది ఆయన అభిమతం. పాత వాహనాలను ప్రభుత్వమే సేకరించి వాటిని పారిశ్రామిక ప్రాంతాలకు తరలించి రీసైకిల్ చేస్తామని, అందుకుగాను కొంత మొత్తాన్ని కారు యజమానికి ఇస్తామని అన్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకూ ఈ ప్రతిపాదనలు ఉపకరిస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. పాతకార్ల స్థానంలో కాలుష్య నిబంధనలు పాటించే కొత్త మోడల్స్ రోడ్లపైకి వస్తాయని వివరించారు. పాత కారుకు రూ. 25 వేలు, బైకుకు రూ. 10 వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిపారు.