: దోమకు సోషలిజం ఆపాదించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంచి వక్త. సభికులను ఆకట్టుకోవడంలో ఆయన శైలే వేరు. సూటిగా విషయం చెబుతూనే, సమయానుకూలంగా హాస్యాన్ని పండిస్తారు. కొన్నిసార్లు ఆయన భావ తీవ్రత కొంచెం ఇబ్బంది కలిగించినా, మొత్తమ్మీద తాను చెప్పదలుచుకున్నది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా విశదీకరిస్తారు. తాజాగా, తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రారంభోత్సవంలోనూ తనదైన శైలిలో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఆయన ప్రసంగిస్తూ దోమకు సోషలిజాన్ని ఆపాదించి అందరినీ నవ్వించారు. చెత్త ఎక్కడుంటే దోమ అక్కడుంటుందని తెలిపారు. అయితే, దోమకు తేడాలు తెలియవని, అది ఎవరినైనా కుడుతుందని చెప్పుకొచ్చారు. "అందుకే దోమను సోషలిస్టు అనాలి. ఎమ్మెల్యేని కానివ్వండి, మంత్రిని కానివ్వండి... చివరికి ముఖ్యమంత్రినైనా అది కుడుతుంది. ఎదురుగా ఎవరు వస్తున్నా దానికి అనవసరం. ఊరి సర్పంచ్ వస్తున్నాడా... లేక, మంత్రి వస్తున్నాడా అనేది పట్టించుకోదు. పైగా, కుట్టవచ్చా? కుట్టకూడదా? అని చూడదు. దోమ కుడితే మలేరియానో, చలిజ్వరమో వస్తుంది. అప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది" అని వివరించారు.