: మేము రిజర్వేషన్లు అడుగుతుంటే... కేసీఆర్ ఇఫ్తార్ విందు ఇస్తానంటున్నారు: షబ్బీర్ అలీ
రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్నికల స్టంటుగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అభివర్ణించారు. ముస్లింలు రిజర్వేషన్లు అడుగుతుంటే... కేసీఆర్ మాత్రం ఇఫ్తార్ విందు ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లను ఆకర్షించడానికే కేసీఆర్ ఇఫ్తార్ విందులు అంటున్నారని విమర్శించారు. ముస్లిం మైనార్టీలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డుకు అధికారాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.