: మహిళల వద్ద అతిగా ప్రవర్తించి, పదవి ఊడగొట్టించుకున్న మంత్రి
ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన మంత్రిగారు వచ్చిన పని చూసుకోకుండా, అతి చేసి పదవి ఊడగొట్టించుకున్న సంఘటన నేపాల్ లో చోటుచేసుకుంది. నేపాల్ లో వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని ఘనంగా వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మంత్రి హోదాలో తెల్లటి టీషర్టు, మెడలో వరినాట్లు దండగా ధరించిన హరిప్రసాద్ పరాజులి హాజరయ్యారు. వరి నాట్లు వేసిన ఆయన, అంతటితో ముగించి వెళ్లిపోకుండా, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలను కౌగిలించుకోవడం మొదలుపెట్టాడు. 'వద్దు వద్దు' అని కొంతమంది వారిస్తున్నప్పటికీ ఆయనగారు వదలలేదు. ఈ ఘనకార్యం సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై అక్కడ పెను దుమారమే రేగింది. వ్యవసాయ మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ సీపీఎన్-యూఎంఎల్ నాయకులు కూడా మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వెకిలి చేష్టలకు పాల్పడడం సరికాదని పలువురు హితవు పలికారు. దీంతో చిన్నబుచ్చుకున్న హరిప్రసాద్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని కొయిరాలా ఆమోదించారు.