: కరణ్ జోహార్ కు రాజమౌళి గిఫ్టు
మరికొన్ని రోజుల్లో 'బాహుబలి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా, రానా ప్రతినాయకుడిగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అతి భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 10న ఈ సినిమా విడుదల కానుంది. పలు భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఉత్తరాదిన విడుదల చేయనుంది. ఇటీవలే రాజమౌళి ముంబయి వెళ్లి కరణ్ జోహార్ తో కలిసి 'బాహుబలి' ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. ఈ సందర్భంగా జక్కన్న ఓ అద్భుతమైన పెయింటింగును కరణ్ కు గిఫ్టుగా ఇచ్చారు. 'బాహుబలి' చిత్రంలో కనిపించే భారీ జలపాతాన్ని రమణీయంగా చిత్రించారా పెయింటింగులో. దాన్నందుకున్న కరణ్ ఎంతో అచ్చెరువొందారట. ఆ పెయింటింగును ఓ జ్ఞాపికలా దాచుకుంటానని రాజమౌళితో చెప్పడమే కాదు, దాన్ని తీసుకెళ్లి తన ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీసులో ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచారు.