: రుణమివ్వడం లేదని బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్న పేద రైతు
ఎన్నిమార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా, కాళ్లా వేళ్లా పడి బతిమాలుకున్నా అధికారులు రుణం ఇవ్వడం లేదన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ సిండికేట్ బ్యాంకు వద్ద జరిగింది. పంట రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కోదండరాం అనే రైతు, తనవెంట తెచ్చుకున్న పురుగుల మందును బ్యాంకు ఆవరణలోనే తాగాడు. కడుపులోకి చేరిన మందు పని చేయడం ప్రారంభించడంతో విలవిల్లాడాడు. నలుగురూ చూస్తూనే వున్నారు తప్ప ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అక్కడి కుర్చీలో కూర్చుని వాంతి చేసుకుంటూ, కిందపడిపోయాడు. ఆ తరువాత స్పందించిన కొందరు కోదండరాంను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడటంలో విఫలం అయ్యారు. ఈ దృశ్యాలను పలు టీవీ చానళ్లు చిత్రీకరించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.