: 'దెయ్యం' కోసం యూపీ పోలీసుల వేట
ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఎన్ని కష్టాలో! ఇటీవల మంత్రి అజం ఖాన్ పశువులను ఎత్తుకెళ్లిన దొంగ కోసం భారీ ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించిన పోలీసు శాఖ ఎట్టకేలకు విజయం సాధించింది. ఆ దొంగను పట్టుకుని ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు వారు 'దెయ్యం' కోసం వేట మొదలుపెట్టారు. విషయం ఏమిటంటే... అలహాబాదులోని సంత్ నిరంకారి రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మంత్రగత్తె కనిపించిందని, ఆ ప్రాంతంలో దెయ్యం తిరుగుతోందని పుకార్లు షికారు చేశాయి. సోషల్ మీడియా పుణ్యమా అని నగరం మొత్తం ఈ విషయం పాకిపోయింది. దీంతో, ప్రజలు బెంబేలెత్తిపోయారు. రైల్వే క్రాసింగ్ ఏరియాకు వెళ్లాలంటేనే హడలెత్తిపోయారు ఇక్కడి వాసులు. దీనిపై ఎస్ఎస్పీ కీడ్ గంజ్ పోలీసులను ఈ విషయం ఏంటో చూడమని ఆదేశించారు. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు, ఇదంతా ఓ ముఠా పని అయ్యుంటుదని అనుమానించారు. ప్రజలను దోచుకోవడానికి ఇలా 'దెయ్యం' పేరిట భయాందోళనలు రేకెత్తించి ఉండొచ్చన్నది పోలీసుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అధికారులు పోలీసులను ఆదేశించారు.