: మెట్రో రైలులో వెళుతుండగా ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్
డీఎంకే పార్టీ కోశాధికారి స్టాలిన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో ఇటీవల ప్రారంభించిన మెట్రో రైలులో స్టాలిన్ తన అనుచరులతో కలసి నిన్న (బుధవారం) ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన ఓ ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టినట్టు వీడియో ఫుటేజ్ ద్వారా బయటికి వచ్చింది. రైలులో నిలుచుని ఉన్న స్టాలిన్ ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన దృశ్యం అందులో ఉంది. దీంతో ఇది ఇప్పుడు వివాదంగా మారింది. ఈ సంఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా ఖండించారు. అయితే, ఈ ఆరోపణలను స్టాలిన్ కొట్టిపారేశారు. మెట్రో రైలులో తనతో పాటు వచ్చిన పార్టీ కేడర్ కు చెందిన ఓ వ్యక్తి దారికి అడ్డంగా నిలుచుని ఉండడంతో వేరే చోటకి వెళ్లాలని తాను అతనికి చెప్పానని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ సమయంలో నా చేయి చూపించి చెబుతుండగా అనుకోకుండా అతని ముఖానికి తాకిందని, అంతకంటే ఏమిలేదని వివరించారు. కానీ సీఎం జయలలిత మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభానికి హాజరుకాకుండా ప్రజలను డైవర్ట్ చేసేందుకే తాను ఓ ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టానని నిందిస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు.