: కర్నూలులో బిగ్ ఫైట్... రేపటి ఎమ్మెల్సీ పోలింగ్ పై వేడెక్కిన రాజకీయం
ఫ్యాక్షన్ ఖిల్లా కర్నూలు జిల్లాలో రేపు ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. జిల్లాలో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న వైసీపీకి రెబెల్స్ బెడద పట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో పాటు కొంతమంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అధికార పక్షం వైపు వాలిపోయారు. అయితే వలస వెళ్లిన అభ్యర్థుల అవసరం లేకుండా కూడా గెలిచే బలముందని చెబుతున్న వైసీపీ, మిగిలిన నేతలు మస్కా కొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక నందికొట్కూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డితో పాటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలు ఎటువైపు మొగ్గుతారన్న విషయంపై జిల్లాలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. తమ అభ్యర్థులు టీడీపీకి ఓటేస్తారని కాటసాని ప్రకటించినా, బైరెడ్డి మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. దాదాపు 20 ఓట్లున్న బైరెడ్డి నిర్ణయం ఈ ఎన్నికలో కీలకంగా మారనుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డిని బరిలోకి దింపిన టీడీపీ, ఆయనను ఎలాగైనా గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే తమకున్న బలంతోనే విజయం సాధించి అధికార టీడీపీకి బుద్ధి చెప్పాలని వైసీపీ నేతలు కసితో ముందుకు సాగుతున్నారు. దీంతో రేపు జరగనున్న పోలింగ్ పై ఉత్కంఠ నెలకొంది.