: ‘సుప్రీం’కు చేరిన ఓటుకు నోటు...నిన్నటి రేవంత్ ప్రసంగంతో ఢిల్లీ చేరిన ప్రభుత్వ అడ్వొకేట్లు
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనానికి తెరతీసిన ఓటుకు నోటు వ్యవహారం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరుకుంది. నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉండి నిన్న బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులపై పరుష పదజాలంతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీసం మెలేశారు. రేవంత్ రెడ్డి ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఆడియో కాపీలతో పాటు మీసం మెలేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించిన వీడియో సీడీలతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ వీడియోలను సాక్ష్యంగా చూపించి రేవంత్ పై చర్యలు తీసుకోవాలని వారు సుప్రీంకోర్టును కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకే సర్కారీ అడ్వొకేట్లు ఢిల్లీ చేరుకున్నారని తెలుస్తోంది.