: యావత్ మహిళా లోకాన్ని అవమానించినట్టే!: స్మితా సబర్వాల్
ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ 'ఔట్ లుక్' తీరుపై స్పందించారు. ఔట్ లుక్ పత్రిక తనపై అసభ్యకర రీతిలో కథనం ప్రచురించడం పట్ల ఆమె తీవ్రంగా కలతచెందారు. దీనిపై ఆమె బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ... సివిల్ సర్వీసెస్ లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తనపైనే ఇలాంటి కథనాలు ప్రచురిస్తే, సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసహ్యకరమైన కథనాలతో తనను మాత్రమే కాదని, యావత్ మహిళా లోకాన్ని అవమానించినట్టేనని అన్నారు. "పుట్టినరోజు సందర్భంగా భర్తతో కలిసి ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యాను. ఆ సమయంలో నేను వేసుకున్న దుస్తులను ఉద్దేశించి ఔట్ లుక్ పత్రిక అభ్యంతరకర రీతిలో కథనం, కార్టూన్ ప్రచురించింది" అని వివరించారు. దీనిపై ఆ పత్రికకు నోటీసులు పంపినట్టు తెలిపారు. స్మితా సబర్వాల్ తెలంగాణ సీఎంవోలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.