: ఏసీబీ కోర్టుకు రేవంత్ లాయర్ల పరుగులు!
రేవంత్ రెడ్డి విడుదలకు మార్గం సుగమమైంది. తప్పులు సరిదిద్దిన బెయిలార్డరు కాపీ ఆయన తరపు వాదిస్తున్న లాయర్ల చేతికి అందింది. ఈ కాపీతో పాటు పూచీకత్తులను ఏసీబీ ప్రత్యేక కోర్టులో సమర్పించి రేవంత్ ను విడుదల చేయాలన్న ఆదేశాలను తీసుకునేందుకు న్యాయవాదులు ఆగమేఘాల మీద పయనమయ్యారు. మరికాసేపట్లో ఏసీబీ కోర్టుకు చేరనున్న లాయర్లు మధ్యాహ్నం 3 గంటల్లోగా విడుదల ఆదేశాలను పొందాలని భావిస్తున్నారు. వాటిని సాయంత్రం 4:30 గంటల్లోగా చర్లపల్లి జైలు అధికారులకు అందిస్తేనే, రేవంత్ సాయంత్రానికి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆలోగా జైలుకు ఆదేశాలు అందకుంటే రేవంత్ విడుదల రేపటికి వాయిదా పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను నేడు ఆయనను విడుదల చేయించాలన్న లక్ష్యంతో న్యాయవాదులు పరుగులు పెడుతున్నారు.