: బాబాయ్ నుంచి కొట్టేసినవే ఎక్కువ!: రానా
స్టైల్ పై పెద్దగా మక్కువ లేదని, ఏది సౌకర్యంగా ఉంటే అదే వేసుకుంటానని ప్రముఖ నటుడు రానా తెలిపాడు. 'రుష్' పాదరక్షల బ్రాండ్ అంబాసిడర్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన బాబాయే (ప్రముఖ నటుడు వెంకటేష్) స్టైల్ ఐకన్ అని, ఆయన సినిమాలు చూస్తే ఆయన ఫ్యాషన్ అభిరుచి తెలుస్తుందని అన్నాడు. తన బాబాయ్ దగ్గర్నుంచి కొట్టేసిన వస్తువులు వేసుకోవడం అంటే భలే సరదా అని రానా చెప్పాడు. తన బాబాయ్ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉండేవని, చిన్నప్పటి నుంచి ఆయనవి వేసుకోవడం, ఆయన 'తీసుకో' అంటూ ఇచ్చేయడం అలవాటైపోయిందని రానా వెల్లడించాడు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టమని తెలిపాడు. 'బాహుబలి' లాంటి సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రావని అన్నాడు. అందుకే 'బాహుబలి'ని ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూడాలని ఆయన పిలుపునిచ్చాడు. 'దాన వీర శూర కర్ణ' సినిమాలో దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఎలా నిలిచిపోయారో, 'బాహుబలి'లో భల్లాలదేవ పాత్ర అలా నిలిచిపోతుందని రానా తెలిపాడు. మూడేళ్లుగా సినిమా యూనిట్ తో ప్రయాణించడంతో సినిమాలో పని చేసిన అందరితో అనుబంధం పెరిగిందని, అది అద్భుతమైన అనుభవమని రానా తెలిపాడు. ఈ సినిమా ప్రారంభానికి ముందు ప్రబాస్ తో పెద్దగా పరిచయం లేదని, ఈ సినిమా తరువాత తామిద్దరం మంచి స్నేహితులమయ్యామని చెప్పాడు.