: రాష్ట్రపతి రాక నేపథ్యంలో కోతులను, కుక్కలను పట్టేశారు... పాములు వస్తే పట్టేస్తారట!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పది రోజుల విడిది కోసం సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన విషయం విదితమే. ఆయన కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రపతి కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో కోతులు, ఊరకుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా వాటి కోసం బోనులు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద 7 కోతులను, 21 కుక్కలను బంధించారు. రాష్ట్రపతి నిలయంలోనూ, పరిసరాల్లోనూ చెట్లు ఎక్కువగా ఉన్నందున పాములు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. దీంతో, జంతుప్రదర్శనశాల అధికారులు పాములను పట్టుకునేందుకు ఆరుగురు నిపుణులను నియమించారు. వీరు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారని జీహెచ్ఎంసీ నార్త్ జోన్ వెటర్నరీ అధికారి గోవర్థన్ రెడ్డి తెలిపారు. పట్టుబడిన కోతులు, కుక్కలను జీడిమెట్లలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇక, రాష్ట్రపతి రాక సందర్భంగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి దారితీసే అన్ని దారులకు కొత్త కళ వచ్చింది. అధికారులు గతుకుల రోడ్లకు ఆగమేఘాలపై కొత్త రూపు నిచ్చారు.