: తలసాని విషయంలో గవర్నరునే మోసం చేసిన కేసీఆర్: మర్రి నిప్పులు
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి విషయంలో గవర్నరు నరసింహన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్నికైన తలసానిని మంత్రివర్గంలోకి తీసుకునే ముందు నరసింహన్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి ముందే తలసాని గురించి గవర్నర్ ఆరా తీశారని, తలసానితో పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయిస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. వాస్తవానికి కేసీఆర్ చెప్పిందొకటి, జరిగింది మరొకటి అని నిప్పులు చెరిగారు. కాగా, ఈ విషయంలో తాను ముందే ఎమ్మెల్యే పదవికి, దేశం సభ్యత్వానికీ రాజీనామా చేశానని తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని వివరించారు.