: భార్యతో కలసి బైక్ మీద వెళుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరుపై కాల్పులు


రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వాదన పెరిగి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని నోయిడా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న చంద్రపాల్, అతని భార్య పల్లవి విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తున్నారు. మరో బైకుపై ఇద్దరు యువకులు వేగంగా వస్తూ, వీరి బైకును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఢీ కొట్టారు. ఈ విషయమై వీరి మధ్య మాటలు పెరిగాయి. కోపంతో గన్ తీసిన ఓ యువకుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ వెంటనే పల్లవి పోలీసు కంట్రోల్ రూమ్ కు, సమాచారం ఇచ్చి తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లింది. చంద్రపాల్ పాదంలోకి బులెట్ దిగిందని, ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకులు ఎవరన్న విషయంపై విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News