: రూటు మార్చిన పేకాటరాయుళ్లు...కదిలే కార్లను క్లబ్ గా మార్చుకొన్న వైనం!
హైదరాబాదు నగరంలో పేకాట క్లబ్బులపై ఇటీవల పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. అయితే మాత్రం పేకాట మానేయాలా? అనుకున్నారో, ఏమో తెలియదు కాని... పేకాటరాయుళ్లు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఏకంగా కార్లనే క్లబ్బులుగా మార్చుకుంటున్నారు. ఒకే చోట నిలిపితే అనుమానం వస్తుందనునుకున్న పేకాటరాయుళ్లు, కార్లలో చక్కర్లు కొడుతూనే పేకాటలో నిమగ్నమయ్యారు. అయితే ‘కదిలే క్లబ్బు’లపై కూడా పోలీసులు దాడులు చేశారు. ‘కొత్త స్థావరం’లో నింపాదిగా పేకాడుతున్న పేకాటరాయుళ్లకు అరదండాలు వేశారు. హైదరాబాదులోని వనస్థలిపురంలో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. కార్లనే క్లబ్ గా మార్చుకున్న పేకాటరాయుళ్లపై సమాచారం అందుకున్న నగర పోలీసులు వనస్థలిపురం పరిధిలోని చింతలకుంట సమీపంలో పేకాట క్లబ్బులుగా మారిన ఇన్నోవా, స్కార్పియో కార్లతో పాటు వాటిలోని ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.89,940 నగదుతో పాటు ఏడు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.