: టీవీ ఛానెల్ వాహనాన్ని ఢీ కొట్టిన రాజస్థాన్ సీఎం కాన్వాయ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కాన్వాయ్ లోని ఓ వాహనం టీవీ చానెల్ వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. లలిత్ మోదీ వివాదంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ సీఎం, నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో తన నివాసం నుంచి విమానాశ్రయానికి వెళుతుండగా, ఆమె కాన్వాయ్ లోని ఓ వాహనం టీవీ ఛానెల్ కు సంబంధించిన వాహనాన్ని ఢీ కొట్టింది. సీఎం ఢిల్లీ వెళ్తుండగా మీడియా సంస్థల వాహనాలు వెంబడించాయని, ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. టీవీ ఛానెళ్ల డ్రైవర్లు చాలా వేగంగా వాహనాలు నడుపుతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయాధికారులు పేర్కొన్నారు.