: "ఐ లవ్యూ, ఐ లవ్యూ" అంటూ స్పృహ కోల్పోయాడు ... 'ట్యునీషియా' దాడిపై ప్రత్యక్షసాక్షుల కథనం
ట్యునీషియాలో ఐఎస్ఐఎస్ రక్తపాతం సృష్టించడం తెలిసిందే. సౌసీ పట్టణంలోని ఓ బీచ్ రిసార్ట్ వద్ద సాయుధ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో విగతులయ్యారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. మృతుల్లో అత్యధికులు బ్రిటీషర్లు. కాగా, ఈ కాల్పుల ఘటనను ప్రత్యక్ష సాక్షులు గుర్తు చేసుకుని వణికిపోయారు. ఒలీవియా లెత్లే అనే యువతి దాడి గురించి చెబుతూ... "ఏదో మోత వినిపించింది. దాంతో, ఏం జరుగుతోందో చూద్దామని లాబీ వద్దకు వెళ్లాను. అక్కడ ఓ మహిళ ఎదురుగానే ఆమె భర్త బుల్లెట్ గాయంతో కిందికి ఒరగడం చూశాను. తన భర్తకు కడుపులో బుల్లెట్ తగిలిందని, బీచ్ రక్తసిక్తం అయిందని మాత్రం చెప్పగలిగిందామె. ఇంతలో ఆమె భర్త ఐ లవ్యూ, ఐ లవ్యూ అంటూ స్పృహ కోల్పోయాడు" అని వివరించింది. ఇక సయీరా విల్సన్ అనే మహిళ కాబోయే భర్త కారణంగానే తన ప్రాణాలు దక్కాయని తెలిపింది. "తుపాకీతో దుండగుడు రెచ్చిపోగానే నా ఫియాన్సీ నాకు కవచంలా అడ్డు నిలుచున్నాడు. దీంతో, ఆయనకు బుల్లెట్లు తగిలాయి" అని వివరించింది. ఇప్పుడతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మరో పర్యాటకుడు ఘటన గురించిన వివరాలు మీడియాతో పంచుకున్నాడు. "దూరంగా ఉండండి... నేను మీకోసం రాలేదు అని ఆ టెర్రరిస్టు మాతో చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే మాపై కాల్పులు జరపలేదు. విదేశీయులనే లక్ష్యంగా చేసుకున్నాడు" అని వివరించాడు.