: భార్య నిర్వాకం...న్యూజిలాండ్ లో భారత హై కమిషనర్ రీ కాల్!
భార్య నిర్వాకం న్యూజిలాండ్ లో భారత హైకమిషనర్ ను స్వదేశానికి రీకాల్ చేయించింది. న్యూజిలాండ్ లో భారత హై కమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల తమ షెఫ్ పై అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై స్పందించిన విదేశాంగశాఖ ఆయను న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. న్యూజిలాండ్ లో భారత హైకమిషనర్ రవి థాపర్ ఇంటి నుంచి ఓ రాత్రి షెఫ్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిపోయాడు. అక్కడ అపస్మారక స్థితిలో స్థానికులకు కనిపించాడు. దీంతో అతనిని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తేరుకున్న అతను, థాపర్ భార్య షర్మిల తనను వేధింపులకు గురి చేశారని, అమానుషంగా ప్రవర్తించేవారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు స్పందించి, విచారణ చేపట్టారు. దీనిపై న్యూజిలాండ్ లో విమర్శలు వ్యక్తమయ్యాయి. గత నెల 10న విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి ఈ విషయం వచ్చింది. దీంతో, రవి థాపర్ ను భారత్ కు పిలిపించిన రాయబార కార్యాలయం, ఘటనపై విచారణకు ఓ బృందాన్ని పంపింది. నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామని న్యూజిలాండ్ ప్రభుత్వానికి వెల్లడించింది.