: సెక్షన్ 8 అమలు చేస్తే...కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తానన్నారు: రాజ్ నాథ్ వద్ద నరసింహన్ వ్యాఖ్య
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్నటి ఢిల్లీ పర్యటనలో పలు ఆసక్తికర అంశాలు చర్చకొచ్చాయి. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దే యత్నం చేసిన తనను తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకింత అయోమయంలోకి నెట్టేశారని నరసింహన్ కేంద్రానికి చెప్పుకున్నారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేస్తే, తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ బెదిరించారని ఆయన రాజ్ నాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాను ముందడుగు వేసేందుకు కాస్త జంకానని, మీ సలహా కోసం చూడాల్సి వచ్చిందని నరసింహన్ పేర్కొన్నారట. అయితే ఈ ఫిర్యాదుపై రాజ్ నాథ్ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. రాజకీయ పార్టీల బెదిరింపులకు అనుగుణంగా రాజ్యాంగ సంస్థలు వ్యవహరించరాదని ఆయన నరసింహన్ కు సూచించారట. ఈ సందర్భంగా భేటీలో పాల్గొన్న హోం శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ కుమార్ రాజ్యాంగం, ఏపీ పునర్విభజన చట్టం కాపీలను తీసుకొచ్చి మరీ, నరసింహన్ అనుమానాలను నివృత్తి చేశారట.