: శాంతింపజేయాల్సిన బాధ్యత మీదే!...తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలపై గవర్నర్ కు కేంద్రం సూచన


ఓటుకు నోటు కేసు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ భుజస్కందాలపైనే పెట్టింది. ఈ మేరకు నిన్న ఢిల్లీ వెళ్లిన నరసింహన్ కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారట. చేతిలో ఉన్న అధికారాలకు పని చెప్పకుండా పరిస్థితిని ఇంతదాకా తేవడమేమిటని కూడా ఆయనపై రాజ్ నాథ్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొన్న రాత్రి ఢిల్లీ వెళ్లిన నరసింహన్, నిన్న ఉదయం రెండు పర్యాయాలు రాజ్ నాథ్ తో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. సెక్షన్ 8 సహా పలు ఇతర అంశాలపై తనకున్న చిన్నపాటి అనుమానాలను నరసింహన్ కేంద్రం వద్ద నివృత్తి చేసుకున్నారు. అనంతరం మరో రెండు రోజుల పాటు అక్కడే ఉండాలని భావించినా, రాజ్ నాథ్ ఆదేశాలతో ఉన్నపళంగా నిన్న రాత్రే ఆయన తిరిగి హైదరాబాదు చేరుకున్నారు. కేంద్రం ఆదేశాలతో ఒకింత స్పష్టమైన పంథాతో హైదరాబాదు చేరిన నరసింహన్ నేడో, రేపో తన మంత్రాంగానికి పనిచెప్పే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News