: లలిత్ మోదీతో మాట్లాడడం తప్పేమీ కాదు: కాంగ్రెస్
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ లండన్ లో ప్రియాంక, రాబర్ట్ వాద్రాలను కలవడంతో వివాదం రాజుకుంది. కళంకితుడు లలిత్ మోదీతో గాంధీ కుటుంబం సన్నిహితంగా ఉండడం పట్ల కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, మోదీతో మాట్లాడడం తప్పేమీ కాదని కాంగ్రెస్ అంటోంది. ఈ విషయమై కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ రణ్ దీప్ సూర్జీవాలా మాట్లాడుతూ... ప్రియాంక గానీ, ఆమె భర్త గానీ లలిత్ మోదీతో ఎప్పుడూ ప్రత్యేకంగా మాట్లాడలేదని, ఓ రెస్టారెంటులో ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడడం నేరమేమీకాదని స్పష్టం చేశారు. అసలు, లలిత్ మోదీ బీజేపీ ఆదేశానుసారం పనిచేస్తున్నాడని, సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేల రాజీనామాను డిమాండ్ చేస్తున్న విపక్షాలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సుష్మ, వసుంధరలపై వస్తున్న ఆరోపణలపై కేంద్రం ప్రజలకు సమాధానం ఇవ్వాలని సూర్జీవాలా డిమాండ్ చేశారు.