: లలిత్ మోదీతో గాంధీ కుటుంబం ఎందుకు సన్నిహితంగా ఉంటోంది?: బీజేపీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను తాను లండన్ లో కలిశానంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన ప్రకటన వివాదాలకు దారితీసింది. నిన్నటివరకు బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడితే ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. లలిత్ తో గాంధీ కుటుంబం నిరంతరం ఎందుకు సంబంధం నడుపుతోందో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. "ఈరోజు లలిత్ నుంచి ఆ రకమైన ట్వీట్స్ వెల్లడైన నేపథ్యంలో... గాంధీ కుటుంబాన్ని నిన్న లలిత్ కలిసినట్టు ఇప్పుడు మాకు అర్థమవుతోంది. అసలు ఆయనతో వారెందుకు టచ్ లో ఉంటున్నారో మేం అడగాలనుకుంటున్నాం" అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రశ్నించారు. ఎమర్జెన్సీకి 40ఏళ్లు పూర్తయిందని, అత్యవసర స్థితిలో దేశమంతా చీకటి రోజును చూసిందని అన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఇక్కడే ఉండి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ గాంధీ కుటుంబమంతా విదేశీ పర్యటనకు వెళ్లి లలిత్ మోదీని కలిసిందని ఆయన మండిపడ్డారు.