: కొడవలి చేతబట్టి చిరుతతో పోరాడిన రైతు... ప్రకాశం జిల్లాలో ఘటన
ముంబైలో నిన్న రాత్రి... నేటి ఉదయం ప్రకాశం జిల్లా జిల్లెలమూడి... రెండు ప్రాంతాల్లో జరిగిన వరుస ఘటనల్లో చిరుత పులులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిన్న రాత్రి ముంబై శివారులో అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఓ చిన్న కుక్క అరుపులతో బెంబేలెత్తిన ఓ చిరుత పలాయనం చిత్తగించగా, నేటి ఉదయం ప్రకాశం జిల్లాలో తనపై దాడి చేసిన చిరుతను ఓ బక్క రైతు కొడవలి చేతబట్టి ఎదురొడ్డాడు. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జిల్లెలమూడికి చెందిన రైతు నరసింహారావు తన పొలంలో పనిచేసుకుంటుండగా, అకస్మాత్తుగా ఆయనపై చిరుత పులి దాడి చేసింది. చిరుత దాడితో వెనువెంటనే తేరుకున్న నరసింహారావు చేతిలోకి కొడవలినే ఆయుధంగా చేసుకుని చిరుతకు ఎదురొడ్డి పొరాడాడు. ఈ పోరులో చిరుత పరారు కాగా, చిరుత దాడిలో నరసింహారావు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెనువెంటనే అక్కడి స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.