: ఒక్క పైసా కూడా చేజారనీయకండి... ‘పది’ పరిధి శాఖలకు టీ సీఎస్ ఆదేశం


తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ 8 అమలు వివాదంపై కాస్తంత వేడి తగ్గినా, సెక్షన్ 10 పరిధిలోని సంస్థల వ్యవహారాలపై వివాదం ముదిరింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 10 పరిధిలో మొత్తం 142 సంస్థలున్నాయి. వీటిలో దాదాపు 104 సంస్థలపై పూర్తి స్థాయి అధికారాలు తమవేనని తెలంగాణ సర్కారు గట్టిగా వాదిస్తోంది. అయితే ఈ సంస్థల్లో తమ ప్రాబల్యం పెంచుకునే చర్యలకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ సంస్థల ఉన్నతాధికారులతో నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 102 సంస్థలకు చెందిన ఒక్క పైసా కూడా చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం సదరు సంస్థల ఖాతాలు ఉన్న బ్యాంకులకు నోటీసులు కూడా జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంపై అటు ఏపీ సర్కారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News