: ఆమె ముందు కంప్యూటర్ కూడా తలవంచాల్సిందే!
మానవ కంప్యూటర్, లెక్కల మాంత్రికురాలిగా భరతజాతి గొప్పదనాన్ని ప్రపంచం నలుచెరగులా చాటి చెప్పిన అచ్చమైన భారతీయ మహిళ శకుంతలాదేవి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శకుంతలాదేవి అనారోగ్యం కారణంగా 83 ఏళ్ల వయసులో నిన్న బెంగళూరులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ లెక్కల మాస్టర్ మైండ్ గురించి కొన్ని తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలున్నాయి.
మూడేళ్ల వయస్సులోనే శకుంతలాదేవి తన అపార తెలివితేటలను ప్రదర్శించడం ప్రారంభించారు. బెంగళూరులోనే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో శకుంతల 1929 నవంబర్ 4న జన్మించారు. తండ్రి కుల వృత్తికి భిన్నంగా సర్కస్ వైపు వెళ్లారు. దాంతో శకుంతల తండ్రి వెంట వెళుతూ ఉండేవారు. ఒకరోజు సర్కస్ లో భాగంగా కార్డ్స్ మాయాజాలంలో తండ్రికి శకుంతల సహకరించారు. తన చిట్టితల్లి బుర్ర బహు గట్టిది అని తెలుసుకున్న శకుంతలాదేవి తండ్రి సర్కర్ నుంచి బయటకొచ్చి శకుంతలతో నంబర్ల మాయాజాల ప్రదర్శనలు ఇప్పించడం ప్రారంభించారు.
ఆరేళ్ల వయసులో మైసూర్ యూనివర్సిటీలో జ్ఞాపక శక్తి, కాల్క్యులేషన్ ప్రదర్శన ఇచ్చారు. ఇదే విధమైన ప్రదర్శన అన్నామలై యూనివర్సిటీలో 8 ఏళ్లప్పుడు ఇచ్చారు. 1977లో అమెరికన్ యూనివర్సిటీలో శకుంతల ఇచ్చిన ఒక ప్రదర్శన తలపండిన శాస్త్రవేత్తలను సైతం దిమ్మదిరిగేలా చేసింది. 23వ వర్గానికి చెందిన 201 అంకెల నంబర్ ను ఇవ్వగా దీన్ని లెక్కించి జవాబు చెప్పడానికి ఆమె కేవలం 50 సెకండ్లు మాత్రమే సమయం తీసుకుంది.
916748676920039158098660927585380162483106680144308622407126516427934657 040867096593279205767480806790022783016354924852380335745316935111903596 577547340075681688305 620821016129132845564805780158806771 ఈ నంబర్ ను 50 సెకండ్లలో ఏ పరికరం సాయం లేకుండానే లెక్కించి జవాబు చెప్పారు. తర్వాత ఇదే నంబర్ ను లెక్కించడానికి కంప్యూటర్ కు పట్టిన సమయం 70 సెకండ్లు. అదీ శకుంతల మేథావితనం. ఇక 13 అంకెల నంబర్ ను మరో 13 అంకెల నంబర్ తో హెచ్చవేసి 28 సెంకడ్లలోనే సమాధానం చెప్పి 1995లో గిన్నిస్ లోకి సగర్వంగా ఎక్కేశారు.
లెక్కలు అత్యంత సులభంగా ఎలా చేయాలనే దాని గురించి పలు పుస్తకాలను శకుంతలాదేవి విద్యార్థులకు అందించారు. ది బుక్ ఆఫ్ నంబర్స్, మీ చిన్నారిలోని ప్రతిభను బయటకు తీయండి, ఫిగరింగ్ మేడ్ ఈజీ రచనలన్నీ శకుంతలా రాసినవే. చిన్నారులలో లెక్కల పట్ల భయాన్ని పోగొట్టి లెక్కలంటే మక్కువ కలిగేలా ఆమె పాటు పడ్డారు. తన అపార మేథస్సుతో మనదేశానికి పేరు తేవడమే కాకుండా.. భావి విద్యార్థులకూ లెక్కల విషయంలో అనురక్తి కలిగించడంలో తనవంతు సేవ చేసిన శకుంతలాదేవీ ప్రతీ ఒక్కరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. లెక్కలు కూడా శకుంతలమ్మను గుర్తు పెట్టుకుంటాయి!