: సిరీస్ ఓడినా టీమిండియా ర్యాంకులో మార్పులేదు!
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో ఓటమిపాలైనా టీమిండియా ర్యాంకులో ఎలాంటి మార్పులేదు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తన రెండోస్థానాన్ని నిలుపుకుంది. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను భారత్ 1-2 తేడాతో చేజార్చుకోవడం తెలిసిందే. భారత్ ర్యాంకులో మార్పు లేకున్నా రేటింగ్ మాత్రం కాస్తంత కిందికి జారింది. ఇంతక్రితం ధోనీసేన 117 రేటింగ్ తో ఉండగా, ఇప్పుడది 115కి పడిపోయింది. ఇక, బంగ్లాదేశ్ విషయానికొస్తే, భారత్ పై సాధించిన అద్భుత సిరీస్ విజయంతో ర్యాంకింగ్స్ లో ఓ స్థానం మెరుగుపరుచుకుని ఏడో ర్యాంకుకు ఎగబాకింది. ఈ జాబితాలో వన్డే వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియా (129) అగ్రస్థానంలో ఉంది. మూడో స్థానంలో న్యూజిలాండ్, నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా, ఐదో స్థానంలో శ్రీలంక ఉన్నాయి.