: ఆ ముగ్గురు మంత్రులూ రాజీనామా చేయాల్సిందే: ఆప్
నీతిమంతమైన పాలన చేయాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మహిళా మంత్రులిద్దరితో బాటు, రాజస్థాన్ సీఎం కూడా తక్షణం రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఆప్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు, భద్రతాధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆప్ నేతలు మాట్లాడుతూ, అవినీతి అంతం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, కేంద్ర మంత్రులపై ఆరోపణలు వచ్చినా తొలగించడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతీ ఇరానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లలిత్ మోదీ పాస్ పోర్ట్ విషయంలో సుష్మ స్వరాజ్, వసుంధర రాజే సహాయం చేసినట్టు ఆరోపణలు రాగా, ఎన్నికల అఫిడవిట్ లో స్మృతీ ఇరానీ విద్యార్హతలు నకిలీవని ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ వివాదాల కారణంగా ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.