: ఒక్క సిరీస్ ఓడితేనే చెడ్డవాడయ్యాడా?... ధోనీకి మద్దతుగా నిలిచిన రైనా
బంగ్లా టూర్ లో జట్టు పేలవ ప్రదర్శనతో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శల జడివాన కురుస్తోంది. వన్డే జట్టు వైస్ కెప్టెన్ గానే కాక, టెస్టు జట్టు కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్న టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా ధోనీపై పరోక్ష విమర్శలు చేశాడు. దీనిపై జట్టు ఆల్ రౌండర్ సురేశ్ రైనా ధోనీకి మద్దతుగా నిలిచాడు. నిన్నటి మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రైనా, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ధోనీపై వెల్లువెత్తుతున్న విమర్శలపై విరుచుకుపడ్డాడు. ‘‘ఒక్క సిరీస్ ఓడితేనే ధోనీ చెడ్డవాడయ్యాడా? టీమిండియాకు అతడు చిరస్మరణీయ విజయాలెన్నో అందించాడు. అతడు సాధించిన విజయాలను చూసైనా అతడిని విమర్శించకూడదు. అతడు విజయవంతమైన కెప్టెనే కాదు మానవత్వమున్న నాయకుడు. నిజాయతీ కలవాడు కూడా. ఒకే ఒక్క సిరీస్ అతడిని చెడ్డవాడిగా నిర్ధారించలేదు. డ్రెస్సింగ్ రూంలో అతడంటే అందరికీ ఇష్టమే’’ అని రైనా గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు.