: ఓ యజ్ఞం మొదలైంది: వెంకయ్య నాయుడు
ఇండియాను తదుపరి తరం అభివృద్ధి దిశగా నడిపించేందుకు నేడు ఓ మహత్తర యజ్ఞం మొదలైందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన అటల్ పట్టణ రూపాంతరీకరణ, పనరుజ్జీవన పథకాల (అమృత్) ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ, భారత్ ను అభివృద్ధిలో పరుగులు తీయించడమే అమృత్ ఉద్దేశమని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అమృత్ పథకాలు అమల్లోకి వస్తే ప్రతి భారతీయుడి సొంతింటి కలా నిజమవుతుందని, పట్టణాలు మరింత ప్రగతితో దూసుకెళ్తాయని ఆయన వివరించారు. పట్టణాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడం కోసం ఈ నవీకరణ పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెంకయ్య నాయుడు తెలిపారు. మంచి దూరదృష్టి ఉన్న నాయకుడిగా మోదీ చేపట్టిన ఈ యజ్ఞానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్టు వివరించారు. ఈ పథకాల కోసం రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. రూ. 48 వేల కోట్లతో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు.