: కాల్ మాట్లాడుతుండగా ఐఫోన్ లో మంటలు... ఆపై పేలుడు
గతంలో కొన్ని చైనా తయారీ ఫోన్లు పేలిపోయి వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటనలు తెలిసిందే. నాణ్యమైన పరికరాలు వాడనందునే అవి పేలిపోయి ఉంటాయని ఆయా ఘటనల సందర్భంగా నిపుణులు పేర్కొన్నారు. అయితే, హైఎండ్ స్మార్ట్ ఫోన్ గా పేరుగాంచిన ఐఫోన్ కూడా పేలిపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. గుర్గావ్ లో కిషన్ యాదవ్ అనే వ్యక్తి తన ఐఫోన్ 6లో కాల్ మాట్లాడుతుండగా, ఫోన్ లో మంటలు గుర్తించాడు. హ్యాండ్స్ ఫ్రీ మోడ్ లో మాట్లాడుతుండగా, ఫోన్ లో మంటలు రావడంతో అతడు దాన్ని దూరంగా విసిరేశాడు. అనంతరం, సెకన్ల తేడాతో ఆ ఫోన్ పేలిపోయింది. దీనిపై ఫిర్యాదు చేసిన యాదవ్, పేలిపోయిన ఫోన్ ను ఐఫోన్ కస్టమర్ సెంటర్ కు అప్పగించాడు. కొన్నాళ్ల కిందట అమెరికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. లాంగ్ ఐలాండ్ లో ఓ వ్యక్తి జేబులో ఉన్న ఐఫోన్ పేలిపోయింది. దాంతో, అతడికి గాయాలయ్యాయి. 2014లో భారత్ లో లాంచ్ అయిన ఐఫోన్ 6 ఇతర బ్రాండ్లకు గట్టి పోటీదారుగా నిలిచింది. కాగా, తమ ఫోన్ పేలిపోయిన ఘటనపై ఐఫోన్ తయారీదారు ఆపిల్ స్పందించినట్టు తెలిసింది. ఫిర్యాదును పరిశీలిస్తామని కంపెనీ అధికారి చెప్పినట్టు ఓ వార్తా పత్రిక పేర్కొంది.