: తమపై తిరగబడిందని కబడ్డీ క్రీడాకారిణి ఇంటికివెళ్లి దాడి చేశారు!
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిపై దుండగులు దాడి చేశారు. కాన్పూర్ లో ఈ ఘటన జరిగింది. డాలీ సింగ్ అనే క్రీడాకారిణి తన నివాసంలో ఉండగా కొందరు సాయుధ దుండగులు ముఖాలు కన్పించకుండా ముసుగులు ధరించి వచ్చారు. డాలీపై విచక్షణ రహితంగా దాడి చేశారు. వారు తీవ్రంగా కొట్టడంతో ఆమె ముఖంపై బలమైన దెబ్బలు తగిలాయి. అంతకుముందు తమ వేధింపులను అడ్డుకుని, తమపై తిరగబడి, ఫిర్యాదు చేసిందన్న కారణంతోనే వారు డాలీపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఘటనపై డాలీ తండ్రి మండిపడ్డారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారని, ఆ తర్వాత పట్టించుకోలేదని అన్నారు. దాంతో తాము డీఐజీని కలవగా, ఆయన తమను ఊరడించేందుకు ప్రయత్నించారే తప్ప చర్యలకు మొగ్గు చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమాజ్ వాదీ పార్టీ నేత గౌరవ్ భాటియా మాట్లాడుతూ... ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తారని చెప్పారు.