: కేసీఆర్ ఇంకా ఉద్యమ నేతగానే వ్యవహరిస్తున్నారు: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్య
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మరోసారి ఫైరయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కేసీఆర్, ఇంకా ఉద్యమ నేతగానే వ్యవహరిస్తున్నారని కేఈ కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. సీఎం హోదాలో ఉంటూనే కేసీఆర్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారమే ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిందన్న విషయాన్ని గుర్తు చేసిన కేఈ, ఆ చట్టంలోని సెక్షన్ 8 చెల్లదని కేసీఆర్ చెప్పడం సరికాదని సూచించారు. అంతేకాక సెక్షన్ 8పై దీక్షకు దిగుతానని కేసీఆర్ ప్రకటించడం కూడా భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు.