: ఆఫీసులో ఇవి తింటే మేలట!
కాలం మారింది. దాదాపు ప్రతి చిన్న పనికీ యంత్రాలు వచ్చేశాయి. దాంతో, సహజంగానే వ్యక్తులకు శారీరక వ్యాయామం తగ్గింది. ఇంకేముందీ!... మేమున్నామంటూ వ్యాధులు వెన్నంటే వచ్చేస్తున్నాయి! ముఖ్యంగా, కూర్చుని పనిచేసే వ్యక్తుల్లో దీని తాలూకు దుష్పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, ఆఫీసు పనివేళల్లో ప్రత్యేక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఫ్యాట్, షుగర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారం తీసుకుంటే అలసటగా ఉంటుందని, మందకొడిగా తయారవుతారని తెలిపారు. దాని ప్రభావం ఆఫీసు పనిపై పడుతుందని వివరించారు. అయితే, మూడు రకాల ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందడంతోపాటు ఉత్సాహంగా ఉండొచ్చట. అవేంటో చూద్దాం! తాజా ఫలాల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని, యాపిల్, అరటి, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, చెర్రీ ఫలాలు స్నాక్స్ గా తినేందుకు భేషైనవని తెలిపారు. వీటిలో పోషక విలువలే కాదు, సమృద్ధిగా యాంటీఆక్సిడాంట్లు కూడా ఉంటాయట. యాంటీఆక్సిడాంట్లు వ్యాధులతో పోరాడడంలో విశేషంగా సహకరిస్తాయి. ఇక, ఎండబెట్టిన పండ్లు కూడా మంచివేనన్నది నిపుణుల అభిప్రాయం. ఆల్మండ్, రైజిన్స్, ఆప్రికాట్స్, అరటి, ప్రూన్స్ వంటివి చిరుతిళ్లుగా బాగా ఉపయోగపడతాయని అన్నారు. వీటిలో పొటాషియమ్, ఫైబర్ అధికంగా ఉంటాయట. ముఖ్యంగా, ఆల్మండ్స్ లో ఉండే ఒమేగా-9 ఫ్యాటీ ఆసిడ్ గుండెకు మంచిది. బాగా ఉడికించిన కోడిగుడ్డు కూడా ఆఫీసు పని వేళల్లో తీసుకుంటే శక్తినిస్తుందని చెప్పారు. ప్రొటీన్లు పొందడానికి ఇది అద్భుతమైన మార్గమని, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయని అన్నారు. పైగా, కోడిగుడ్డు ఉడకబెట్టడం చాలా సులువని, ఎప్పుడైనా దీన్ని తీసుకోవచ్చని వివరించారు.