: టైట్ జీన్స్ వేసుకోవడంతో అమ్మడి రక్తప్రసరణ ఆగిపోయింది!
జీన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనేముంది? పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మెచ్చే వస్త్రరాజం ఈ జీన్స్. ముఖ్యంగా, యువతకు ఇది హాట్ ఫేవరెట్. అలాంటి ఈ జీన్స్ ఎంతపని చేసిందో చూడండి! ఆస్ట్రేలియాలో ఓ మహిళ (35) చాలా టైట్ గా ఉన్న జీన్స్ ధరించింది. ఎంత టైట్ అంటే... ఆమె రక్తప్రసరణ కూడా ఆగిపోయేంత! దాంతో, ఆమె పిక్కల కండరాలకు రక్త సరఫరా ఆగిపోయింది. కాళ్లు మొద్దుబారినట్టవడంతో ఆమె కుప్పకూలింది. ఆమెను పరిశీలించిన వైద్యులు, ఎక్కువసేపు రక్తనాళాలపై ఒత్తిడి పడడం మూలంగా ఈ పరిస్థితి తలెత్తిందని, కండరాలు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఓ బంధువు ఇల్లు మారుతుండడంతో, ఆ వ్యక్తికి సహాయం చేస్తూ ఆమె ఎక్కువసేపు ఆ ప్యాంటుతోనే ఉండాల్సి వచ్చిందని కన్సల్టెంట్ న్యూరాలజిస్టు థామస్ కింబర్ తెలిపారు. ఆమె ఆసుపత్రికి వచ్చేసరికి నరాలు ఉబ్బిపోయి ఉన్నాయని, ఆ పరిస్థితి ఎంతో ప్రమాదకరమని వివరించారు. ఆ టైట్ జీన్స్ ను విప్పే వీలులేక, కత్తిరించి తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. మరీ టైట్ దుస్తులు ధరించడంపై ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.