: ఉద్యోగుల వేతనాలకూ నిధుల్లేని దుస్థితిలో నిర్మాణ రంగ దిగ్గజం!


యునిటెక్... దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పలు విజయవంతమైన నిర్మాణాలు చేపట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ. ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. ఎంతగా అంటే, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు సంస్థ వద్ద నిధుల్లేవని తెలుస్తోంది. అంతేకాదు, ఉద్యోగుల నుంచి కట్ చేసుకున్న టీడీఎస్ (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), ప్రావిడెంట్ ఫండ్ తదితరాలను కూడా కట్టలేకపోతోంది. ఇటీవలి కాలంలో సరైన సమయానికి వేతనాలు ఇవ్వలేకపోతున్నదని సంస్థపై ఉద్యోగులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గృహాల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పడిపోవడమే యునిటెక్ కష్టాలకు కారణమని తెలుస్తోంది. దీనికితోడు ఒకేసారి పలు ప్రాజెక్టులను మొదలు పెట్టడం, ముందుగా అనుకున్న సమయానికి డెలివరీ ఇవ్వకపోవడంతో సంస్థపై కొనుగోలుదారులు పెట్టిన కేసులు పెరిగిపోవడం కూడా ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిందని సంస్థ ఉద్యోగులు వ్యాఖ్యానించారు. తమకు ఆరు నెలల వేతనం అందాల్సి వుందని, సెప్టెంబర్ 2014 వేతనాన్ని ఏప్రిల్ 2015లో అందుకున్నానని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఉద్యోగి ఒకరు తెలిపారు. ఇదే విషయమై సంస్థ ఎండీ అజయ్ చంద్ర స్పందిస్తూ, వేతనాల చెల్లింపులో కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, పరిస్థితులు సద్దుమణుగుతాయని భావిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News