: బీఎస్సీ విద్యార్థిని స్వాతి హత్య వెనుకు ఫుట్ బాల్ క్రీడాకారుల హస్తం?
ఈ నెల 13న హుజూరాబాద్ సమీపంలో హత్యాచారానికి గురైన ఖమ్మంజిల్లా బీఎస్సీ విద్యార్థిని దారం స్వాతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భద్రాచలం ఫుట్ బాల్ జట్టు సభ్యులను పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. 12వ తేదీన హుజూరాబాద్ లో తెలంగాణ ఫుట్ బాల్ పోటీలు జరగడం, 13వ తేదీన ఓటమిపాలైన జట్టు సభ్యులు ఖమ్మం బయలుదేరడం, అదే రోజు సాయంత్రం స్వాతిపై హత్యాచారం జరగడం వెనుక ఫుట్ బాల్ ఆటగాళ్ల ప్రమేయంపై పోలీసులు అనుమానపడి, ఆ దిశగా విచారణ వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ దిశగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు గుట్టుగా విచారణ జరుపుతున్నారు. భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న స్వాతి హుజూరాబాద్ ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న కోణంలో విచారిస్తున్నారు. వాస్తవానికి భద్రాచలం జట్టుకు ఇక్కడి టోర్నమెంట్ నిర్వాహకులు ఆహ్వానం పంపలేదని తెలుసుకున్న పోలీసులు, వారు ఇంతదూరం వచ్చి పోటీల్లో పాల్గొనడం వెనుక స్వాతి ఉదంతం కారణమా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.