: మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు... టీపీసీసీ చీఫ్ కు తేల్చిచెప్పిన జయసుధ


‘‘సికింద్రాబాదు నియోజకవర్గ ఇంచార్జీగా ఎవర్నైనా నియమించుకోండి. నాకెలాంటి అభ్యంతరం లేదు’’ అని ప్రముఖ సినీ నటి, సికింద్రాబాదు మాజీ ఎమ్మెల్యే జయసుధ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తేల్చిచెప్పారు. జయసుధ కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చి గులాబీ కండువా కప్పుకుంటారన్న వార్తల నేపథ్యంలో నేటి ఉదయం టీ పీసీసీ నేతలు కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీ సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు కీలక నేతలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం జయసుధకు ఫోన్ చేశారు. సికింద్రాబాదు నియోజవకర్గ ఇంచార్జీని మార్చాలనుకుంటున్నామని చెప్పిన ఉత్తమ్, ఈ విషయంలో ఆయన జయసుధ అభిప్రాయాన్ని కోరారట. నియోజకవర్గ ఇంచార్జీని మార్చాలన్న పార్టీ నిర్ణయంపై మనసు నొచ్చుకున్న జయసుధ ఘాటుగానే స్పందించారు. ‘‘ఇంచార్జీగా మీ ఇష్టమొచ్చిన వారిని నియమించుకోండి. ఇందులో నాకెలాంటి అభ్యంతరం లేదు’’ అని ఆమె కాస్త కఠువుగానే సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో జయసుధ పార్టీ మారడం ఖాయమన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అంతేకాక పార్టీ మారే విషయంలో తనకున్న కాస్తంత ఇబ్బందిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్చారన్న భావనతో జయసుధ ఉన్నారన్న ప్రచారానికి తెరలేసింది.

  • Loading...

More Telugu News