: ధోనీపై అంత తొందరెందుకు?... వెనకేసుకొచ్చిన గంగూలీ, గవాస్కర్, వెంగ్ సర్కార్
బంగ్లాదేశ్ పై సిరీస్ ఓటమి తరువాత ఒకవైపు అభిమానుల నుంచి విమర్శలు, మరోవైపు కొందరు మాజీలు చేసిన వ్యాఖ్యలతో 'నేనిక తప్పుకుంటా'నని ధోనీ చేసిన ప్రకటనను పట్టించుకోవాల్సిన పనిలేదని మాజీ క్రికెటర్లు అంటున్నారు. కేవలం ఒక్క సిరీస్ లో ఓడిపోయినంత మాత్రాన ధోనీని తొలగించాల్సిన పనిలేదని ఆయన్ను వెనకేసుకొచ్చారు. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో ఫలితం దురదృష్టకరమేనని అభిప్రాయపడ్డ మాజీ కెప్టెన్ గవాస్కర్, ఓ కొత్త బౌలర్ విసిరిన బంతులకు మన ఆటగాళ్లు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని అన్నాడు. ధోనీలో తానెలాంటి మార్పూ గమనించలేదని, భారత క్రికెట్ కు అతని అవసరం ఇంకా ఉందని అన్నాడు. మరో మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఓటమి తరువాత ఆవేశంలో ధోనీ అలా మాట్లాడి వుండవచ్చని, ధోనీని తప్పించాల్సిన పని లేదని అన్నాడు. వన్డేల్లో ధోనీ అద్భుతమైన కెప్టెన్ అని అభివర్ణించిన గంగూలీ, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు. తనలో జట్టును నడిపించే శక్తి ఉందా?... లేదా? అన్న విషయాన్ని ఆలోచించుకునేందుకు ఆయనకు సమయమివ్వాలని అన్నాడు. ధోనీని తప్పించాల్సిన పనిలేదని, ఇటీవలే భారత జట్టును వరల్డ్ కప్ సెమీ ఫైనల్ వరకూ చేర్చిన కెప్టెన్ అతనేనన్న విషయం మరువద్దని మరో మాజీ ఆటగాడు వెంగ్ సర్కార్ అన్నాడు. కెప్టెన్ గా అతడినే కొనసాగించాలని సూచించాడు.