: భారత్ అతనికి బదులివ్వలేకపోయింది: గవాస్కర్
మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్ కు వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఒక్కసారిగా బలహీన జట్టుగా మారిపోయింది. స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకుండా, కనీస పోటీ ఇవ్వకుండానే భారత్ ఘోర పరాభవం చవిచూసింది. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ దీనిపై స్పందించారు. ఈ ఫలితాలు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ఘనతను గుర్తించకతప్పదని అన్నారు. బంగ్లా కుర్రాళ్లు అద్భుతమైన క్రికెట్ ఆడారని కితాబిచ్చారు. ఈ సిరీస్ సందర్భంగా బంగ్లాదేశ్ జట్టుకు ఓ కొత్త బౌలర్ (ముస్తాఫిజూర్ రెహ్మాన్) దొరికాడని, అతని బౌలింగ్ కు భారత్ బదులివ్వలేకపోయిందని పేర్కొన్నారు. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో ముస్తాఫిజూర్ మెరుగైన కోణంలో బంతులు విసిరాడని గవాస్కర్ తెలిపారు. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి జీర్ణించుకోవడం కష్టమే అయినా, కారణాలు తెలియకుండా విమర్శలు చేయరాదన్నారు. అంతకుముందు, ధోనీ గురించి స్పందిస్తూ... సారథ్యం నుంచి తప్పుకోవడమన్నది అతనికి సంబంధించిన విషయమని అన్నారు. అయితే, ధోనీలో ఇంకా సేవలందించే సత్తా ఉందనే భావిస్తున్నట్టు తెలిపారు. అతను భారత్ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ అని అన్నారు. టి20, చాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్, టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు... ఇలా టీమిండియాకు ఎన్నో ఘనతలు అందించాడని వివరించారు. అందుకే ధోనీని గౌరవించాలని సూచించారు. ఇప్పటికిప్పుడు ధోనీని తొలగించడం అనేది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.