: నేను కాకపోతే ఎవరో ఒకరు చంపాల్సిందే కదా?: 'చార్లెస్టన్' హంతకుడు
అమెరికాలో సంచలనం సృష్టించిన 'చార్లెస్టన్' చర్చ్ కాల్పుల ఘటన నిందితుడు డైలాన్ రూఫ్ (21) విచారణలో ఆశ్చర్యకర సమాధానాలు ఇచ్చాడట. ఎందుకు కాల్పులు జరిపావని అధికారులు ప్రశ్నించగా, తాను కాకపోతే ఎవరో ఒకరు ఆ పని చేయాల్సిందే కదా? అని బదులిచ్చాడట. చారిత్రక చర్చ్ లో మారణకాండ సృష్టించిన తర్వాత రూఫ్ తుపాకీ చేతపట్టుకుని శవాలపై నర్తించాడని పోలీసులు తెలిపారు. అతడు వికటంగా నర్తిస్తున్న సమయంలో అక్కడే ఓ ఆఫ్రో అమెరికన్ జాతీయుడు ఉండగా... ఇక్కడ ఏం జరిగిందో మీ సమాజానికి చెప్పాల్సింది నువ్వేనని అతడిని కాల్చకుండా విడిచిపెట్టాడట రూఫ్. ఈ శ్వేతజాతి యువకుడి దురాగతంపై జాత్యహంకార కోణంలోనూ విచారిస్తున్నారు పోలీసులు. అతని గత చరిత్రను పరిశీలించిన పిమ్మట పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. గుండు కొట్టించుకుని అసహనం ప్రకటించేవాడని, శ్వేతజాతిని కాపాడేవారు లేకుండా పోయారని ఎన్నోమార్లు ఎలుగెత్తేవాడన్న విషయాలను పోలీసులు తెలుసుకున్నారు. చార్లెస్టన్ ప్రాంతంలో ఆఫ్రో అమెరికన్ల జనాభానే అధికం కావడం కూడా రూఫ్ ఆందోళనకు కారణమని అర్థమవుతోంది. అటు, రూఫ్ తుపాకీ పట్టేందుకు కారణం ఇదీ అంటూ మరో వాదన వినిపిస్తోంది. రూఫ్ ఓ యువతిని ఇష్టపడగా, ఆమె ఓ నల్లజాతి యువకుడితో డేటింగ్ మొదలుపెట్టిందని... దాంతో, ఆమెను ఆకట్టుకున్న నల్లజాతి యువకుడిపై కసితోనే రూఫ్ నల్లజాతీయులు అధికంగా వచ్చే చర్చ్ లో రక్తం కళ్లజూశాడని ఓ కథనం చెబుతోంది.