: ఇకపై ఆంధ్రప్రదేశ్ లో షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్లలో కూడా మద్యం
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై ప్రవహించనుంది. ఇకపై షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్లలో కూడా మద్యం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం పాలసీని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ మద్యం విధానం రెండేళ్ల వరకు అమలులో ఉండనుంది. కల్తీ మద్యం, నాటుసారాలను అరికట్టేందుకు టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. బార్ లపై మరో విధానం ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. టూరిజం గెస్ట్ హౌస్ లు, త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టులు, పబ్ లు, క్లబ్ లు, బార్ లు ప్రతి ఏటా రెన్యువల్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ పరిధిలో మైక్రోబేవరేజెస్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4,380 మద్యం షాపులకు అనుమతులు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. 5 వేల జనాభాకు 30 లక్షల రూపాయలు, పది వేల జనాభాకు 34 లక్షల రూపాయలు, 10 నుంచి 25 వేల జనాభాకు 37 లక్షలు. 50 నుంచి 3 లక్షల జనాభాకు 45 లక్షలు. 5 లక్షలపై బడిన జనాభాకు 50 లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. దరఖాస్తు ఫీజు గ్రామీణ ప్రాంతాల్లో 30 వేలు, పట్టణాల్లో 40 వేలు, కార్పొరేషన్లలో 50 వేల రూపాయలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు సహా రెండేళ్ల పాన్, వ్యాట్ వివరాలు జతచేయాలని ఆయన స్పష్టం చేశారు.