: ఆయుధాలు తయారుచేసేవాళ్లు క్రైస్తవులు కాదు: పోప్
ప్రపంచ సమస్యలపై పోప్ ఫ్రాన్సిస్ మరోసారి గళం విప్పారు. ఆయుధ తయారీదారులు క్రైస్తవులు కానేకారని స్పష్టం చేశారు. ఒకవేళ క్రైస్తవులమని వారు చెప్పుకుంటే అది తమను తాము మోసం చేసుకున్నట్టేనని అన్నారు. ఇటలీలోని టురిన్ పట్టణంలో యువజన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పోప్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం కపటంతోనే ఏదైనా సాధ్యమవుతోందని, ఆయుధ పరిశ్రమలు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండడం లేదని విమర్శించారు. ఇక, ప్రపంచ యుద్ధాలను, వాటి కారణంగా వాటిల్లే నష్టాలను వివరించారు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని 'ద గ్రేట్ ట్రాజెడీ ఆఫ్ ఆర్మేనియా' అని పేర్కొన్నారు. అయితే 'మారణహోమం' అన్న పదాన్ని మాత్రం ఆయన ఉపయోగించలేదు. అందుకో కారణం ఉంది. వందేళ్ల క్రితం 1.5 మిలియన్ల మంది ఆర్మేనియన్లను ఊచకోత కోశారని, 20వ శతాబ్దపు తొలి మారణహోమం అని ఏప్రిల్ నెలలో ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలకు నిరసనగా టర్కీ ప్రభుత్వం వాటికన్ నుంచి తమ అంబాసడార్ ను వెనక్కి పిలిచింది. ఈ నేపథ్యంలో పోప్ టురిన్ లో జరిగిన యువజన సభలో ఆచితూచి మాట్లాడారు.