: సిట్ చేతికి ట్యాపింగ్ ఆదేశాల కాపీలు...మరికాసేపట్లో అందజేయనున్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా ఏపీ సర్కారులోని పలువురు కీలక అధికారులు, టీడీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి తెలంగాణ సర్కారు జారీ చేసిన ఆదేశాల కాపీలు మరికాసేపట్లో ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేతికి అందనున్నాయి. ఈ మేరకు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో జరగనున్న విచారణకు హాజరయ్యేందుకు వస్తున్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు సదరు కాపీలను తమ వెంట తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తమ ముందు విచారణకు హాజరుకావాలని సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ అధికారులు తాఖీదులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ వ్యవహారానికి సంబంధించి అందుబాటులో ఉన్న ఆధారాలను తీసుకురావాలని కూడా సర్వీస్ ప్రొవైడర్లను సిట్ ఆదేశించింది. నోటీసుల్లో పేర్కొన్న మేరకే సర్వీస్ ప్రొవైడర్లు టీ సర్కారు తమకు జారీ చేసిన ఆదేశాల కాపీలను తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.