: బాలపోచయ్యా ఎలా ఉన్నావ్... పాత స్నేహితుడికి కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో నిన్న ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓ వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురి కావడమే కాక వెనువెంటనే ఆయన దగ్గరికి వెళ్లిపోయారు. ‘‘ఏంటి బాలపోచయ్యా ఇలా వచ్చావ్’’ అంటూ సదరు వ్యక్తిని పేరు పెట్టి మరీ పలకరించిన కేసీఆర్, ఆయనకు కుశల ప్రశ్నలేశారు. కేసీఆర్ పలకరిస్తున్న వ్యక్తి ఎవరో తెలియక అక్కడి వారంతా అయోమయంలో పడ్డారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని స్నేహానికి కేసీఆర్ ఇచ్చిన విలువను కీర్తించారు. తొలినాళ్లలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచే ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నాడు యూత్ కాంగ్రెస్ లో ఉన్న సమయంలో బాలపోచయ్యతో కేసీఆర్ అత్యంత సన్నిహితంగా ఉండేవారట. ఆ తర్వాత కేసీఆర్ టీడీపీలో చేరడం, తదనంతరం టీఆర్ఎస్ పేరిట సొంత పార్టీ ప్రారంభించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బాలపోచయ్యతో కేసీఆర్ కు సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. నిన్న బాలపోచయ్య కనిపించగానే, ఆయన వద్దకెళ్లిన కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక బాలపోచయ్య టీఆర్ఎస్ లో చేరారని తెలుసుకున్న కేసీఆర్, క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలవమని ఆయనకు చెప్పారు. పనిలో పనిగా పార్టీలో మంచి పదవి ఇస్తానని కూడా బాలపోచయ్యకు కేసీఆర్ హామీ ఇచ్చారట.