: అక్రమార్కుల పాలిట సింహస్వప్నం ఈ మహిళా ఐఏఎస్!


అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న మహిళా అధికారుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పురుషులకు దీటుగా మహిళా అధికారులు కూడా తమ సత్తా చాటుతున్నారు. అక్రమార్కులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా తాండూరులో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. వికారాబాదు సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న అలుగు వర్షిణి జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై దృష్టి సారించారు. ఎక్కడెక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న దానిపై పూర్తి స్థాయి సమాచారం సేకరించారు. ఇక మొన్న రాత్రి ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాలోని యాలాల మండలం బెన్నూరు-తాండూరుల మధ్య కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందుకున్న వర్షిణి... రెవెన్యూ, పోలీసు అధికారుల సహాయం లేకుండానే ఒంటరిగా బైక్ పై అక్కడికి వెళ్లారు. ఆమె రాకను గమనించిన ఇసుకాసురులు పరుగులు పెట్టారు. అయినా వెనక్కు తగ్గని వర్షిణి, బైక్ పైనే వారిని వెంటాడారు. కొంతమంది కూలీలను పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. దాడుల్లో భాగంగా ఓ ట్రాక్టర్ తో పాటు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై ఇసుక తవ్వకాలకు వస్తే ఆధార్, రేషన్ కార్డులను తొలగిస్తానని సదరు కూలీలను ఆమె హెచ్చరించారు.

  • Loading...

More Telugu News