: మళ్లీ చిత్తైన భారత్... టీమిండియాపై బంగ్లాదేశ్ సిరీస్ విజయం


బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా పరాజయాల బాటలో పయనిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగియగా, ఆ తర్వాత జరిగిన వన్డేలో ధోనీ సేనకు బంగ్లా జట్టు షాకిచ్చింది. తాజాగా నిన్న జరిగిన డే నైట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా బంగ్లాదేశ్ తొలిసారిగా టీమిండియాపై సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ నగరం మిర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్ రెండో బంతికే టీమిండియా తొలి వికెట్ చేజార్చుకుంది. తొలి వన్డేలో మెరిసిన భారత స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ డకౌటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (53) రాణించినా, ఫస్ట్ డౌన్ లో వచ్చిన వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(23) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ (47) కాస్త ఫరవాలేదనిపించినా, అంబటి రాయుడు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. సురేశ్ రైనా (34), రవీంద్ర జడేజా (19) నిలదొక్కునేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కేవలం 45 ఓవర్లలోనే 200 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు 38 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ఆధారంగా బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. ఓపెనర్ నుంచి క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ మెన్ అంతా తలో చేయి వేసి టీమిండియాపై చిరస్మరణీయ విజయం సాధించి, భారత్ పై తొలి సిరీస్ ను దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News